న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఆరోపించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లో ఆయన మీడియా తో మాట్లాడారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను శిక్షించకుండా.. ఆయన కొడుకుకు మోదీ ఎంపీ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఇది మహిళా రెజ్లర్లకు చెంపపెట్టులాంటి దేనని అన్నారు. బ్రిజ్‌భూషణ్, ప్రజ్వల్ రేవణ్ణలాంటోళ్లను బీజేపీ చేరదీస్తోందని మండిపడ్డారు. మోదీ పరివార్‌లో నారీ శక్తి అనేది కేవలం నినాదాలకే పరిమితమని స్పష్టమైందన్నారు. ఆడబిడ్డల రక్షణ కంటే అధికారమే మోదీకి ముఖ్యమైందని మండిపడ్డారు.
